ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్, ఎస్‌కేటీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో డా. తులా మాట్లాడుతూ, “ముందస్తు నిర్ధారణ, వ్యాక్సినేషన్ అనేవి ఆన్షనల్స్ కావు. ఇవే ప్రాణరక్షక మార్గాలు. హెచ్‌పీవీ కారణంగా వచ్చే క్యాన్సర్ వ్యాధులను సైతం నివారించవచ్చు.” అని స్పష్టం చేశారు.
రెగ్యులర్ హెల్త్ చెకప్‌లపై నిర్లక్ష్యం వద్దు..
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది 100కి పైగా రకాల వైరస్‌ల సమాహారం. వీటిలో ముఖ్యంగా హెచ్‌పీవీ 16, 18 వంటి హై-రిస్క్ రకాలే ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 శాతం సర్వైకల్ క్యాన్సర్లకు కారణమవుతున్నాయని ఆయన తెలిపారు.
అంతేకాకుండా గొంతు, ఆనల్ కేనల్, పురుషాంగం, వల్వా, వెజైనా క్యాన్సర్లకూ హెచ్‌పీవీ ప్రధాన కారణమవుతోందన్నారు. ఈ వైరస్ ప్రత్యేకత ఏమిటంటే, సంవత్సరాల పాటు ఎలాంటి లక్షణాలు లేకుండానే శరీరంలో మార్పులు తీసుకువచ్చి, క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే, క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే 90 శాతం కంటే ఎక్కువ మంది పూర్తిగా కోలుకునే అవకాశముందని డా. తులా పేర్కొన్నారు. ఆలస్యంగా గుర్తిస్తే చికిత్స ఫలితాలు తీవ్రంగా తగ్గిపోతాయని తెలిపారు.
ముఖ్యంగా మహిళలు, హై-రిస్క్ వర్గాలు పాప్ స్మియర్, హెచ్‌పీవీ డీఎన్ఏ టెస్టులు, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించకముందే యాంటీబాడీలు ఉత్పత్తి చేసి రక్షణ కల్పించే శక్తి ఈ వ్యాక్సిన్‌కు ఉందని డా. తులా వివరించారు. లైంగిక జీవితం ప్రారంభమయ్యే ముందు వ్యాక్సిన్ వేయించుకుంటే అత్యుత్తమ ఫలితం ఉంటుందని, అయితే అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ ఇది ఉపయోగకరమేనన్నారు.
ఖచ్చితమైన వయోపరిమితి లేకపోయినా, విస్తృతంగా అమలు చేస్తే హెచ్‌పీవీ కారణంగా వచ్చే క్యాన్సర్లలో 90 శాతం వరకు నివారించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీన్ని ప్రధాన సమస్యగా చూడాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమం క్లాస్‌రూమ్‌లకే పరిమితం కాకుండా మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. చివరగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ అందర్నీ ఆకట్టుకుందని తెలిపారు.